మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపిలో క్రియాశీలిగా పని చేసిన డాక్టర్ సిరంగి సౌందరయ్య
ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా పనిచేసిన అపర భగీరథుడు డాక్టర్ సౌందరయ్య
ఆనాడు అత్యున్నత స్థాయిలో ఉండి కూడా పదవులు ఆశించని స్నేహశీలుడు
పరకాలలో 23న డాక్టర్ సిరంగి సౌందరయ్య వర్ధంతి
పరకాల సెప్టెంబర్ 21 (అక్షయ న్యూస్) :
పరకాల ప్రాంతంలో ప్రజాసేవలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ వైద్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సిరంగి సౌందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్ తండ్రి అయిన డాక్టర్ సౌందరయ్య వైద్యుడిగా, ప్రజా నాయకుడిగా పరకాల ప్రాంతంలో గుర్తింపు పొందారు. తాడిత, పీడిత ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖ నాయకులు వచ్చిన సందర్భాల్లో బీజేపీ సీనియర్ నాయకుడిగా కీలకంగా వ్యవహరించారు.2001 సెప్టెంబర్ 23న నక్సల్స్ చేతిలో డాక్టర్ సౌందరయ్య హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన సౌందరయ్య.. పరకాల ప్రాంతంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారని డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్ తెలిపారు. ప్రజాసేవ, సామాజిక నిబద్ధతలో ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని, ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.