🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

నాపై ఆర్థిక డిమాండ్ ఆరోపణలు అవాస్తవం..

Main Image
ముఖ్యమైన పాయింట్స్:మైనింగ్‌ కు వ్యతిరేకం కాదు.. జీవనోపాధి నష్టానికి వ్యతిరేకం’నిరూపిస్తే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తాకంఠాత్మకూర్‌ సర్పంచ్‌ కొంగంటి తిరుపతి


నడి కూడ సెప్టెంబర్ 23 (అక్షయ న్యూస్) : నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామ పరిధిలోని చాకిరేవు గుట్టపై మైనింగ్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను అవాస్తవం అని సర్పంచ్‌ కొంగంటి తిరుపతి ఖండించారు. బుధవారం నడికుడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక డిమాండ్‌ చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.మైనింగ్‌కు తాను వ్యతిరేకం కాదని, గుట్టను తవ్వడం వల్ల గ్రామానికి, రైతులకు జరిగే నష్టానికే వ్యతిరేకమని తెలిపారు. గుట్టకు సమీపంలోని మాటు రిజర్వాయర్‌పై ఆధారపడిన సుమారు 1,600 ఎకరాల ఆయకట్టు, కాకతీయుల కాలం నాటి శివాలయం, మడేలయ్య ఆలయం, గుట్టకు సమీపంలోని హై లెవెల్‌ వంతెన, తాటి–ఈత చెట్లు, పంట పొలాలు, స్మశానవాటికకు మైనింగ్‌ వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిజర్వాయర్‌ పరిధిలోని సహజ వాగులు, జలపాతాలు, పర్యాటక ప్రాంతం కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామస్తులను తాను రెచ్చగొడుతున్నానన్న ఆరోపణలను తిరుపతి ఖండించారు. సెప్టెంబరు 1న జరిగిన గ్రామసభలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా గ్రామస్తులు చాకిరేవుగుట్ట పరిరక్షణ సమితి(జేఏసీ)గా ఏర్పడి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారని, వారి తరఫున సర్పంచ్‌గా తాను గొంతు వినిపిస్తున్నానన్నారు. రామకృష్ణాపురం, మాదన్నపేట, గూనిపర్తి, శనిగరం గ్రామాల ప్రజల మద్దతు కూడా ఉందని తెలిపారు.
దళిత కాంట్రాక్టర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కులాన్ని అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన గ్రామంలో ఏడుగురు దళిత వార్డు సభ్యులను, ఒక దళితుడిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్న విషయాన్ని గుర్తుచేశారు. మైనింగ్‌ విషయంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
మంగళవారం చాకిరేవు గుట్ట వద్దకు కొందరిని తీసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించారని తిరుపతి ఆరోపించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మైనింగ్‌ లీజు రద్దు చేయాలని కలెక్టర్‌, మైనింగ్‌ శాఖతో పాటు సంబంధిత అధికారులకు గ్రామస్తుల తరఫున ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. లీజు రద్దయ్యే వరకు రైతులు, గ్రామస్తులతో కలిసి గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.తన తండ్రి స్వర్గీయ కొంగంటి కొమురయ్య గ్రామం కోసం పనిచేసిన విషయాన్ని గుర్తుచేసిన తిరుపతి.. రాజకీయ వారసుడిగా తనకు గ్రామ ప్రజలు రెండుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్‌గా అవకాశం ఇచ్చారని తెలిపారు. చివరి శ్వాస వరకు గ్రామ ప్రయోజనాల కోసం పోరాడుతానని పేర్కొన్నారు.కార్యక్రమంలో శనిగరం సర్పంచ్‌ కొత్తపల్లి రాజు, మాదన్నపేట సర్పంచ్‌ కత్తి రమేష్‌, ధర్మారం సర్పంచ్‌ బాషిక ఎల్లస్వామి, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్‌ పెండ్లి రాజు, కంఠాత్మకూర్‌ ఉపసర్పంచ్‌ కుమారస్వామి, మాదన్నపేట రైతు బుర్ర కర్ణాకర్‌, కంఠాత్మకూర్‌ మాజీ సర్పంచ్‌ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home