పరేషాన్‌లో పరకాల పురవీధులు..!
కంపు కొడుతున్న కాలనీలు..
అనారోగ్య భయంతో పట్టణ ప్రజలు
పండుగ వేళా పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
కార్యాలయం కదలని కమిషనర్!
పరకాల, అక్టోబర్ 16 (అక్షయ న్యూస్):
పరకాల పట్టణ పురవీధులు, కాలనీలు అపరిశుభ్రతతో కంపు కొడుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఆనందంగా గడపాల్సిన సమయంలో చెత్తాచెదారం, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
*పండుగ వేళా పరేషాన్ లో పారిశుధ్యం?*
పండుగల సమయంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఉంది. అయితే పరకాలలో కొన్ని కాలనీల్లో చెత్త తొలగింపు సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
*కార్యాలయం కదలని కమిషనర్!*
పట్టణంలో పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్ తీరుపై పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికే పరిమితమవకుండా కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని కోరుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని, పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పండుగ వేళైనా పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరుతున్నారు.